డ్రగ్స్ మాఫియాను వదలం

27-11-2026 | 05:10am
  1. తయారీ, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం 
  2. ఖైరతాబాద్ గణేశుడి సాక్షిగా కిషన్‌రెడ్డి హెచ్చరిక
  3. 2029 నాటికి డ్రగ్ ఫ్రీ భారత్
  4. ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో కేంద్ర మంత్రి 
  5. రెండో రోజు క్రీడా, సినీ ప్రముఖుల సంఘీభావం
  6. నేడు యాత్ర ముగింపు
  7. సభకు చిరంజీవి, నాగార్జున, రవిశంకర్ గురూజీ 

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ మాఫియాను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, మాదకద్రవ్యాలను తయారు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) హెచ్చరించారు. ఖైరతాబాద్ గణేశుడి సాక్షిగా డ్రగ్స్ మాఫియాను పట్టుకుని చట్టప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని, ఈ పాదయాత్ర సోషల్ మీడియా లైకుల కోసం కాకుండా భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు చేపట్టిన ఉద్యమమని ప్రకటించారు.

ప్రతి విద్యార్థి డ్రగ్ ఫ్రీ వారియర్‌గా మారాలని, దేశంలో మరో పంజాబ్ తరహా పరిస్థితులు తలెత్తకుండా సమాజమంతా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కిషన్‌రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగింది. ఉదయం యోగాతో ప్రారంభమైన యాత్ర ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, హిమాయత్ నగర్, లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వరకు కొనసాగింది.

విద్యార్థులు, యువత, మహిళలు, క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అలాంటి యువశక్తి మత్తు పదార్థాలకు బానిసై నిర్వీర్యం కాకూడదన్నారు. విద్యార్థులతో పాటు ఐటీ ఉద్యోగులు, వైద్యులు, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారు సైతం డ్రగ్స్ బారిన పడు తుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. బంజారాహిల్స్ పరిధిలో గంజాయి మత్తు లో పదో తరగతి విద్యార్థి తనను వారించిన స్నేహితుడినే హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. మాదకద్రవ్యాల ప్రభావం యువత జీవితాలను ఎంతటి ప్రమాదంలోకి నెడుతోందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నారు. 

మెడిసినల్ ప్లాంట్స్ పేరుతో గంజాయి సాగు 

మెడిసినల్ ప్లాంట్స్ సాగు పేరుతో అధిక ఆదాయం వస్తుందని ఆశ చూపి గిరిజన రైతులతో అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయిస్తున్న ముఠాలపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు హెరాయిన్, కొకైన్, సింథటిక్ డ్రగ్స్‌ను చాక్లెట్లు, బిస్కెట్లు, సిగరెట్లు, ఇంజెక్షన్ల రూపంలో యువతకు చేరవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను కూకటివేళ్లతో నిర్మూలించేందుకు ఈగల్ విభాగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. 

తల్లుల చైతన్యంతోనే డ్రగ్స్‌కు కళ్లెం

హిమాయత్‌నగర్, లిబర్టీ ప్రాంతాల్లో విద్యార్థులు, మహిళలను ఉద్దేశించి మాట్లాడిన కిషన్‌రెడ్డి.. డ్రగ్స్ నిర్మూలనలో తల్లులు, అక్కాచెల్లెళ్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని, పిల్లల కదలికలు, స్నేహాలు, అలవాట్లపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లిబర్టీ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. అనం తరం ఖైరతాబాద్ గణేశుడి ప్రాంతం మీదు గా పాదయాత్ర కొనసాగింది. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, దేశంలో మరో పంజాబ్ తరహా పరిస్థితులు రాకుండా ఇప్పటి నుంచే సమా జం అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. 

సత్యం థియేటర్ వద్ద ముగింపు

ముషీరాబాద్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఖైరతాబాద్, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద ముగిసింది. అక్కడ నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై పోరాటం ప్రభుత్వానికో, పోలీసులకో మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి కుటుంబం ఇందులో భాగస్వామి కావాలని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రాబోయే వడేళ్లపాటు ప్రతి ఇంటికీ డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లాలని కోరారు. గ్రీన్ రివల్యూషన్ తర్వాత దేశ ఆర్థికాభివృ్ధలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ నేడు డ్రగ్స్ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోవడం బాధాకరమన్నారు. యువత నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా కుటుంబాలు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

గోపీచంద్, బెల్లంకొండ సాయి..

రెండో రోజు పాదయాత్రలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొని యువతకు స్ఫూర్తినిచ్చారు. ‘సే యెస్ టు స్పోర్ట్స్.. సే నో టు డ్రగ్స్’ అంటూ క్రీడల వైపు అడుగులు వేయాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సందేశమిచ్చారు. సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. దర్శకుడు సురేష్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. పలువురు దివ్యాంగులు వీల్‌చైర్లలోనే యాత్రలో పాల్గొని ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు. కిషన్‌రెడ్డి సతీమణి కావ్య కిషన్‌రెడ్డి, కుమార్తె వైష్ణవిరెడ్డి సైతం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు.  

నేటి ముగింపు యాత్ర

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల పాదయాత్ర శుక్రవారం ముగియనుంది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు