ఛాంపియన్ సైబరాబాద్

27-11-2026 | 05:15am

పోలీస్ డ్యూటీ మీట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం 

11 పతకాలతో అగ్రస్థానం

ట్రోఫీలు అందజేసిన డీజీపీ సీవీ ఆనంద్

రాజేంద్రనగర్, నవంబరు 26 (విజయక్రాంతి): మూడో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ సైబరాబాద్ కమిషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ(Telangana State Police Duty Meet Trophy)ని కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నాలుగు రోజులపాటు నిర్వహించిన పోటీలు గురువారం ముగిశాయి. మొత్తం 11 పతకాలు (5 స్వర్ణం, 4 రజతం, 2 కాంస్యాలు) సాధించి సైబరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. సైబరాబాద్‌కు చెందిన ఎస్‌ఐ ఆర్ ప్రేమ్‌సాగర్ సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో వ్యక్తిగత ఛాంపియన్‌గా నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 జోన్లు, విభాగాల నుంచి సుమారు 500 మంది పోలీసు సిబ్బంది పాల్గొనగా, ఆరు ప్రధాన విభాగాల్లో 21 అంశాల్లో పోటీలు నిర్వహించారు. మొత్తం 63 పతకాలను ప్రదానం చేశారు. భద్రాద్రి జోన్ 12 పతకాలతో మొదటి స్థానంలో, సైబరాబాద్ 11 పతకాలతో రెండో స్థానంలో, హైదరాబాద్ కమిషనరేట్ 10 పతకాలతో తర్వాతి స్థానంలో నిలిచాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ సీవీ ఆనంద్ విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.

వరుసగా మూడు జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లలో తెలంగాణ పోలీస్ శాఖ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిందని, డిసెంబరు 15 నుంచి 20 వరకు ముంబైలో జరిగే జాతీయ పోటీల్లోనూ అదే విజయపరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎంపికైన విజేతలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పోలీసులకు ఇంక్రిమెంట్లు, నగదు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ మహేష్ మురళీధర్ భగవత్, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిష్త్, డీజీ (సీఐడీ) చారు సిన్హా, సైబరాబాద్ సీపీ ఎం రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు