మళ్లీ ఢీలిమిటేషన్!
- ఈ నెల 30 నుంచి వచ్చే నెల ౩ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
- మరోసారి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు చాన్స్
- ఎజెండాను ప్రకటించని కేంద్ర ప్రభుత్వం
- నేడు క్యాబినెట్ భేటీలో ఖరారుచేసే అవకాశం
- వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, నవంబర్ 26: ఈ నెల 30 నుంచి పార్లమెంట్(Parliament) ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాల నిర్వహణ కోసం సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ నెల 30 లోక్‌సభను సమావేశ పరచాలని, వచ్చే నెల 2న రాజ్యసభను సమావేశ పరచాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వచ్చే నెల 3న ప్రత్యేక సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. మొత్తం నాలుగు రోజులపాటు (నాలుగు రోజులు లోక్‌సభ, రెండు రోజులు రాజ్యసభ) జరిగే ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌పై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాను ప్రకటించలేదు. ప్రభుత్వ అత్యవసర కార్యకలాపాలు అంటూ కిరణ్ రిజిజు పేర్కొనడంతో కీలక బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించుకునేందుకే కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏప్రిల్‌లో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ తగిన బలం లేకపోవడంతో వీగిపోయాయి. ఎలాగైనా నెగ్గించుకోవాలన్న పంతంతో ఉన్న మోదీ సర్కార్.. ఆ దిశగా ఇప్పటికే కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో..!
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించి ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చింది. రెండు కీలక అంశాలను కలిపిపెట్టడం వెనుక కుట్ర ఉందన్న కోణంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో అది వీగిపోయింది.
కేంద్రం చెప్తున్న డీలిమిటేషన్ అమలులోకి వస్తే ముఖ్యంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలకు వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ మద్దతు లేకపోవడంతో ఏప్రిల్‌లో వీగిపోయింది. తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమకు మద్దతు పెరిగిందని బీజేపీ బలంగా నమ్ముతున్నది.
రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే లోక్‌సభలో సుమారు 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇటీవల టీఎంసీ నుంచి బయటకు వచ్చిన 20 మంది ఎంపీలు, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు.. ఇలా పలు పార్టీల సభ్యుల మద్దతు తమకు ఉందని బీజేపీ అంచనాకు వచ్చింది. డీఎంకే పార్టీ ఎంపీల మద్దతు కూడా లభించే అవకాశం ఉందని.. లేదంటే బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఆ పార్టీ సభ్యులు సభలో లేకుంటే సులువుగా గట్టెక్కగలమని విశ్వసిస్తున్నది.
నేడు క్యాబినెట్ భేటీ.. కాంగ్రెస్ మీటింగ్
పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలపై చర్చించేందుకు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఎలాంటి వ్యూహం అనుసరించాలని, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలనేదానిపై ఇందులో చర్చించనున్నారు. అదేవిధంగా.. పార్లమెంట్లో అనుసరించాల్సి వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా శుక్రవారం జరగనుంది. సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మరోసారి హీట్ పెంచే అవకాశం కనిపిస్తున్నది.