జాతీయ రహదారిపై వ్యాపారాలు
- కొనుగోలుదారుల వాహనాల పార్కింగ్తో ఇబ్బందులు
- తరచూ ప్రమాదాలు
- పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
కూకట్పల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): రహదారికి ఆనుకొని వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు దారులు తమ వాహనాలను అక్కడే నిలిపి కొనుగోలు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధి శివానంద రిహాబిలేషన్ సెంటర్ నుండి కెపిహెచ్బి కాలనీ మొదటి రోడ్డు వరకు రోడ్డు పక్కన కొందరు చిరు వ్యాపారులు రోడ్డుపైనే పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి నిత్యవసరాలను తమ వాహనాలలో, బండ్లపై పెట్టుకుని వ్యాపారం నిర్వహిస్తుండడంతో ఆ దారి వెంబడి వెళ్లే కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపైననే ఆపి ఆపి కొనుగోలు చేస్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. సాయంత్రం అయితే చాలు నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇలాంటి బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతంలో ఇదే సమస్యతో ప్రమాదాలు జరిగినప్పటికీ ట్రాఫిక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ట్రాఫిక్ అధికారులు ఇప్పటికైనా జాతీయ రహదారికి ఆనుకొని రోడ్డుపై నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల వ్యాపారాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కూరగాయలు, పండ్లు వాహనాలపై పెట్టుకుని తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు వాటిని కొనుగోలు చేయడానికి రోడ్ల పైననే తమ వాహనాలను నిలిపివేస్తున్నారు. సమీప కాలనీవాసులు సైతం కూరగాయలు పండ్లు కొనుగోలు చేయడానికి తమ ద్విచక్ర వాహనాలతో రాంగ్ రూట్ లో రావడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
పాదాచారులకు ఇబ్బందులు..
ఫుట్‌పాత్‌ను ఆక్రమించి కొంతమంది నర్సరీలు, చిరు వ్యాపారులు శాశ్వతంగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో పాదాచారులకు దారి లేకుం డా పోయింది. దీంతో పాదచారులు రోడ్డుపై నడుస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. సంవత్సరాల నుండి ఫుట్ పాత్ పై శాశ్వత ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ ఆ వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంతకాలంగా అధికా రులు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంపై అధికారులు దృష్టి సారించకపోవడం విచారకరం. నగరంలో పలు ప్రాంతాల్లోని ఫుట్ పాతులపై ఆక్రమణలను తొలగిస్తున్నప్పటికీ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ వ్యాపారాలపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.