సకాలంలో రుణాలు చెల్లిస్తేనే వడ్డీ రాయితీ

28-10-2026 | 07:46pm

కొండయిలపల్లిలో టీజీబీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

నల్లబెల్లి, అక్టోబరు 28 ( విజయ క్రాంతి ): నల్లబెల్లి మండల పరిధిలోని కొండయిలపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)(Telangana Grameena Bank) ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ శాఖాధికారి కృష్ణ(Bank Branch Officer Krishna) మాట్లాడారు.

రైతులు పొందిన పంట రుణాలను ఏడాదిలోపు రీన్యూవల్ చేసుకుంటే 7 శాతం వడ్డీ వర్తిస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. సకాలంలో చెల్లించకపోతే రాయితీ కోల్పోవడంతో పాటు 14 శాతం వడ్డీ విధించబడుతుందన్నారు.

టీజీబీలో 'సహస్ర' పథకం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.5 శాతం, వయోవృద్ధులకు 8 శాతం అధిక వడ్డీ లభిస్తుందన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ నాయక్ మాట్లాడుతూ పి.ఎమ్.ఎస్.బి.వై, పి.ఎమ్.జె.జె.బి.వై, ఎస్.బి.ఐ జనరల్ ద్వారా మొత్తంగా రూ.64 లక్షల ఇన్సూరెన్స్ రక్షణ పొందవచ్చని వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరును సంప్రదించాలని క్యాషియర్ భానుమూర్తి సూచించారు.

సక్రమంగా చెల్లించే మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు బ్యాంక్ లింకేజీ రుణం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎరుకల స్వప్న-నరేష్ రెడ్డి, వీఓఏ వెంకటేశ్వర్లు, బ్యాంక్ మిత్ర ప్రమోద్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు