కల్లు కాదు.. కాలకూట విషం!
నియోజకవర్గంలో యథేచ్ఛగా కల్తీకల్లు దందా..
మత్తులో చిత్తవుతున్న గ్రామీణ బతుకులు
నిజాంసాగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రకృతి సిద్ధంగా లభించే తాటి, ఈత కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నమ్మకం పల్లె ప్రజల్లో బలంగా ఉంది. కానీ, జుక్కల్ నియోజకవర్గం(Jukkal constituency)లో ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. స్వచ్ఛమైన కల్లు స్థానంలో రసాయనాలతో తయారు చేసిన ‘కృత్రిమ కల్లు’ను విక్రయిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నియోజకవర్గంలోని మారుమూల తండాలు, గ్రామాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తోంది.
కల్లు ముసుగులో మత్తు మందుల మిశ్రమం
నియోజకవర్గంలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, నిజాంసాగర్, పిట్లం మండలాల పరిధిలో తాటి, ఈత చెట్ల సంఖ్య తగ్గిపోతున్నా.. కల్లు డిపోలు, దుకాణాల వద్ద మాత్రం విక్రయాలు రెట్టింపయ్యాయి. చెట్ల నుంచి వచ్చే కల్లు ఏమాత్రం సరిపోకపోవడంతో నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు.నీళ్లలో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలం వంటి ప్రమాదకరమైన మత్తు మందులతో పాటు యూరియా, చక్కెర, కుంకుడుకాయ రసం కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు.
తక్షణ మత్తు
ఈ కల్లు తాగిన వెంటనే విపరీతమైన మత్తు ఎక్కడంతో కూలీలు దీనికి బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే, మరుసటి రోజు అది దొరక్కపోతే పిచ్చివాళ్లలా ప్రవర్తించే పరిస్థితి నెలకొంది. రోజంతా కష్టపడి సంపాదించిన కూలీ డబ్బులన్నీ సాయంత్రం అయ్యేసరికి కల్లు దుకాణాల పాలవుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని గిరిజన తండాలు, దళిత వాడల్లో ఈ కల్తీకల్లు మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది.
విషపూరిత కల్లు తాగడం వల్ల చిన్న వయసులోనే కాలేయం ,కిడ్నీలు దెబ్బతింటున్నాయి. నరాల బలహీనత, మతిస్థిమితం కోల్పోవడం, ఫిట్స్ రావడం వంటి సమస్యలతో అనేక మంది మంచాన పడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో మహిళలు:
ఇంటి పెద్ద దిక్కు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగలేక, పిల్లలను పోషించలేక మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. కల్తీకల్లు బారిన పడి అకాల మరణం చెందిన ఘటనలు కూడా నియోజకవర్గంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
అధికారుల ఉదాసీనత.. మాఫియాకు వరంగా!
కల్తీకల్లు దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ అధికారులు మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు కళ్లు మూసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు లేదా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ఒకటి రెండు చోట్ల దాడులు చేసి, శాంపిల్స్ సేకరించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శ ఉంది.
సరిహద్దు ప్రాంతం (మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు) కావడంతో అక్రమ రవాణా, రసాయనాల సరఫరా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ‘కష్టపడి తెచ్చిన రూపాయి కల్లు పాకల పాలవుతోంది. తాగిన మరుసటి రోజు ఒళ్లు వణుకుతూ పనికి కూడా వెళ్లలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఈ కల్తీ దందాను పూర్తిగా అరికట్టకపోతే పేద ప్రజల బతుకులు రోడ్డున పడే అవకాశం వుంది.
నియోజకవర్గంలోని అన్ని కల్లు డిపోలు, దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించి ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారులపై పీడీ (Pౄ) యాక్ట్ నమోదు చేసి కల్తీకల్లుకు బానిసైన వారి కోసం నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యం అందించే ఏర్పాటు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి జుక్కల్ నియోజకవర్గ ప్రజలను ‘కాలకూట విషం’ బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.