కరెంట్ లేక ఎండుతున్న వరి పంటలు
- లో వోల్టేజీతో దమ్మన్నపేట రైతుల అవస్థలు
- కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వచ్చి పది రోజులైనా కనెక్షన్ ఇవ్వని అధికారులు
గంభీరావుపేట అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో విద్యుత్ లో వోల్టేజీ సమస్యతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ట్రాన్స్‌ఫార్మర్(Transformer) పరిధిలో సుమారు 15 ఎకరాల వరి పంటకు సాగునీరు అందక ఎండిపోయిందని తెలిపారు.
లో వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా నడవక వారానికి ఒక్కసారి మాత్రమే పంటకు నీటి తడి అందించగలుగుతున్నామని రైతులు వాపోయారు. సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన పరికరాలు ఎక్కడివక్కడే పడి ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో రైతు శనిగరపు లింగం ఐదు ఎకరాల్లో వరి సాగు చేయగా, నీరందక ఇప్పటికే మూడు ఎకరాల్లో పంట ఎండిపోయిందని తెలిపారు. చేతికొచ్చే దశలో పంట కళ్లముందే ఎండిపోతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి చేనులో నిలబడి నిరసన తెలిపిన రైతులు వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ ఇచ్చి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు.