డిస్‌ప్లేలో తక్కువ.. బిల్లులో ఎక్కువ! ‘స్మార్ట్’ దోపిడీ?

19-09-2026 | 02:05pm
  1. నేరేడుచర్ల రిలయన్స్ మార్ట్‌లో ‘స్మార్ట్’ దోపిడీ?
  2. షెల్ఫ్‌లో కనిపించే ధరకు, బిల్లులో వేసిన రేటుకు తేడా
  3. కోల్గేట్‌పై రూ. 11.75, సర్ఫ్ ఎక్సెల్‌పై రూ. 7.50 అదనపు వసూలు
  4.  గమనించకపోతే జేబుకు చిల్లే..
  5. తనిఖీలు చేపట్టాలని వినియోగదారుల డిమాండ్

నేరేడుచర్ల, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో సామాన్యులను ఆకర్షిస్తున్న బడా సూపర్ మార్కెట్లలో(Big Supermarkets) వినియోగదారుల జేబులకు ‘స్మార్ట్’గా చిల్లు పడుతోంది. వస్తువుల ర్యాక్‌ల వద్ద తక్కువ ధరల ట్యాగ్‌లు ప్రదర్శించి, తీరా బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లేసరికి అధిక ధరలు వేసి మోసగిస్తున్న వైనం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని రిలయన్స్ మార్ట్‌లో వెలుగుచూసింది.

వెలుగుచూసిన బిల్లింగ్ గోల్‌మాల్

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడుచర్ల రిలయన్స్ మార్ట్‌కు(Reliance Mart Fraud) నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. షెల్ఫ్‌లో చూసిన రేటుకు, చేతికి వచ్చిన బిల్లులోని రేటుకు స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది.

వస్తువు పేరు -షెల్ఫ్‌లో చూపించిన రేటు,బిల్లులో వేసిన వేరే రేటు : వినియోగదారుడిపై పడ్డ అదనపు భారం

కోల్గేట్ టూత్ పేస్ట్ ₹206.00 డిస్ప్లెలో బిల్లులో ₹217.75    వచ్చింది. అదనంగా 11.75 రూపాయలు, అలాగే సర్ఫ్ ఎక్సెల్ వ్యాల్యూ ప్యాక్ డిస్ప్లే లో ₹114.00 రూపాయలు ఉండగా, బిల్లులో ₹121.50 రూపాయలు వచ్చింది. అంటే అదనంగా  ₹7.50 రూపాయలు.ఒక్కో వస్తువుపైనే సుమారు రూ. 7 నుంచి రూ. 12 వరకు అధికంగా బిల్లు చేస్తుండటాన్ని ఓ అప్రమత్తమైన వినియోగదారుడు గుర్తించి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిస్టమ్ అప్‌డేట్ కాలేదనో, ఆఫర్ ముగిసిందనో సిబ్బంది దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు బాధితుడు వాపోయాడు.

రోజుకు వేలల్లో అక్రమ వసూళ్లు?

చాలామంది కొనుగోలుదారులు సూపర్ మార్కెట్లలో వస్తువులన్నీ ట్రాలీలో వేసుకుని, చివర్లో ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించి వెళ్లిపోతుంటారు. ప్రతి ఐటమ్‌ను ప్రదర్శన రేటుతో సరిచూసుకునే తీరిక అందరికీ ఉండదు. దీన్నే ఆసరాగా చేసుకుని నిత్యం వందలాది మంది వినియోగదారుల నుంచి ఇలా అదనపు మొత్తాలను గుట్టుచప్పుడు కాకుండా దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక వినియోగదారుడిపై రెండు వస్తువులకే దాదాపు ₹19 వరకు తేడా వస్తే, రోజూ జరిగే వ్యాపారంలో ఎన్ని వేల రూపాయల అక్రమ లాభం గడిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని మండిపడుతున్నారు.

అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి

వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) ప్రకారం డిస్‌ప్లేలో చూపించిన రేటు కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి మోసపూరిత వ్యాపార విధానాలపై లీగల్ మెట్రాలజీ (తూనికలు-కొలతల శాఖ), పౌరసరఫరాల అధికారులు వెంటనే స్పందించి నేరేడుచర్ల రిలయన్స్ మార్ట్‌పై తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని వినియోగదారుల హక్కులను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు