బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- పెళ్లయిన 20 రోజులకే విషాదం
- వరకట్న వేధింపుల కేసు నమోదు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : ఓ బీటెక్ విద్యార్థిని కళాశాల భవనం పై( College building)నుండి దూకి ఆత్మహత్య కు యత్నించి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండలం, కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20) ఘన పూర్‌లోని కేపీఆర్ఐటీ కళాశాలలో బీటెక్ (సిఎస్ఈ) 3వ సంవత్సరం చదువుతోంది. ఈమెకు గత నెల 30న చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త శ్రీకాంత్ రెడ్డి ఆమెను అదనపు కట్నం కోసం, అలాగే శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడు.
భర్త వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన పల్లవి 18న (శుక్రవారం) ఉదయం కళాశాలకు వచ్చి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత విద్యార్థులందరూ వెళ్లిపోగా సుమారు 4:30 గంటల సమయంలో 'డి' బ్లాక్ 3వ అంతస్తు నుండి ఆమె కిందకు దూకింది. కళాశాలలో ఉన్న రవీందర్ బాబు అనే వ్యక్తి ఆమెను గమనించి పెద్దగా కేకలు వేసి ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె కిందకు దూకేసింది.
ఈ ప్రమాదంలో తల, చేతులకు తీవ్ర గాయాలు కాగా, కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10గంటలకు ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో డౌరీ డెత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.