ఉప్పొంగిన మురుగు కాలువ.. ఎనిమిది మంది మృతి
19-09-2026 | 01:50pm
అగర్ మాల్వా: మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా(Agar Malwa) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న కారు ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో పడటంతో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారని పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్ఖేడా పట్టణంలోని బగుళాముఖీ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని నల్ఖేడా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్(Nalkheda Police Station In-charge) శశి ఉపాధ్యాయ ప్రకటించారు. ఒడిశా నుంచి భక్తులతో వెళ్తున్న కారు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ మరణించారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.