ఎన్ని డ్రామాలు చేసినా రేవంత్ 22ఏ భూ వివాదం నుండి తప్పించుకోలేవు

18-09-2026 | 11:31pm

సాగర్ ఎడమ కాలువ నీటిని ఖమ్మం వైరాకు తరలిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా 22 ఏ భూముల వివాదం నుంచి తప్పించుకోలేవని, నిండు శాసనసభలో అబద్ధాలు చెప్పి దొరికిపోయారని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Former Minister Jagadish Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దమ్ముంటే బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి అనుమతించి చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎర్రవల్లి భూముల సర్వేలో దళితులు ప్రభుత్వ తీరును వ్యతిరేకించారని, ఇప్పటి వరకు నోటీసు లు ఇవ్వకుండా సర్వే పేరిట ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. సీఎం కుటుంబం రకరకాల పేర్లతో జనాల్ని భయపెట్టి విలువైన భూములను లాక్కుంటూ తోడేళ్లలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సాగునీరు, కరెంట్ సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ తూములు బంద్‌ పెట్టి ఇక్కడి రైతులను ఎండబెట్టి, ఖమ్మం వైరాకు నీటిని తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒక్క ఎకరం పొలం ఎండినా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలే బాధ్యులవుతారని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పక తీవ్ర పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు