సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాల కోసం కృషి
ఎంపీ గడ్డం వంశీకృష్ణ
నస్పూర్, సెప్టెంబర్ 18 : సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాల కోసం కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) అన్నారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ శుక్రవారం శ్రీరాంపూర్‌లో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలోని కార్మికుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్మికులు, స్థానిక నాయకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్మిక కుటుంబాల దీర్ఘకాలిక సమస్యను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించే అంశంపై చర్యలు తీసుకునేందుకు అంగీకరించినట్లు ఎంపీ తెలిపారు. కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ స్థాయిలో అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని, వారి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించేలా తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. శ్రీరాంపూర్‌లో అంబేద్కర్ భవన నిర్మాణనికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.