చిట్టీలు, అధిక రాబడుల పేరుతో రూ.6.24 కోట్ల వసూళ్లు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్.. ఇంకా రూ.3.05 కోట్ల బకాయిలు
చివ్వెంల, అక్టోబర్ 3 (విజయక్రాంతి): చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు(Daily collections), అధిక రాబడుల పేరుతో ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Government teacher), అతని భార్యను చివ్వెంల పోలీసులు అరెస్ట్(Chivvemla police make arrest) చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు బాధితుల నుంచి రూ.6,24,50,000 సేకరించినట్లు, అందులో రూ.3,18,54,000 తిరిగి చెల్లించగా, ఇంకా రూ.3,05,96,000 బకాయిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సూర్యాపేట(Suryapet) డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన భార్య బానోతు అనూష (33) సహకారంతో 2015 నుంచి డెయిలీ కలెక్షన్లు, చిట్టీల వ్యాపారం నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే భూములు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి మరికొందరి నుంచి నగదు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చిట్టీల గడువు పూర్తయినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన మొత్తాన్ని సుమారు 500–600 మందికి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10 శాతం వరకు అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.
కొనసాగుతున్న దర్యాప్తు
నిందితుల నుంచి స్వీకరించిన మొత్తాలు, బాధితులకు చేసిన చెల్లింపులు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు అరెస్ట్
ఈ కేసులో బానోత్ రాజు (44), అతని భార్య బానోతు అనూష (33)లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
బాధితులు పోలీసులను సంప్రదించాలి
నిందితుల చేతిలో మోసపోయిన ఇతర బాధితులు ఎవరైనా ఉంటే, తమ వద్ద ఉన్న ఆధారాలతో వెంటనే చివ్వెంల పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు. చిట్టీలు, పెట్టుబడులు, అధిక రాబడుల పేరుతో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్న కుమార్ హెచ్చరించారు.
కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్, ఎస్‌ఐలు వి. మహేశ్వర్, వెంకన్న, సిబ్బంది జనార్దన్ రెడ్డి, వెంకటేష్లను అధికారులు అభినందించారు. సమావేశంలో సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వి. మహేష్ పాల్గొన్నారు.