నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

03-10-2026 | 11:47pm

ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్

ములుగు, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో(Indiramma house construction) నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్(State Housing Department Secretary V.P. Gautam) సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం గోవిందరావుపేట మండలం బుస్సాపూర్, తాడ్వాయి మండలం మేడారం, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామపంచాయతీల(Palampet Gram Panchayat) పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను(Indiramma houses) ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం సకాలంలో ఖాతాల్లో జమ అవుతోందా అని ఆరా తీశారు. ఆర్థిక సాయం సకాలంలో అందుతోందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్మాణ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని లబ్ధిదారులు వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి  మాట్లాడుతూ రెండవ విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బిల్లుల మంజూరు విషయంలో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయకుండా, సకాలంలో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించవద్దని, అర్హత ఆధారంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, హౌసింగ్ పి.డి. కృష్ణ ప్రసాద్, స్థానిక తహసీల్దార్లు, హౌసింగ్ శాఖ ఏఈ లు,  ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు