మున్సిపల్ చైర్మన్ పేరుతో పైసా వసూల్.!
- - ఫేస్బుక్ ఐడీతో పీఏ పేరుతో చాటింగ్..
- - ఫోన్ కొనుగోలు పేరుతో డబ్బుల డిమాండ్.
- - విషయం ఆలస్యంగా వెలుగులోకి..
నాగర్ కర్నూల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర పీఏ(Nagar Kurnool Municipal Chairman Teegala Surendra's PA) పేరుతో ఫేస్బుక్ ఐడీ(Facebook ID) ద్వారా కొందరితో ఓ వ్యక్తి చాటింగ్(Chatting) చేస్తూ డబ్బులు అడిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉందని, ట్రాన్సాక్షన్ లిమిట్(Transaction limit) దాటిపోయిందంటూ మొబైల్ స్టోర్లో(Mobile Store) చెల్లింపుల కోసం డబ్బులు అవసరమని కోరినట్లు చాటింగ్ బయట పడింది. గతంలోనూ పలుమార్లు డబ్బులు పంపినట్లు కొందరు పేర్కొంటుండటంతో మొత్తం ఎంత మేర లావాదేవీలు జరిగాయనే దానిపై అనుమానాలున్నాయి.
ఈ వ్యవహారం చైర్మన్ దృష్టికి రావడంతో సంబంధిత వ్యక్తి నుంచి సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు తీసుకుని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. గతంలో రాజకీయ కార్యకలాపాలు, సోషల్ మీడియా ప్రచారంతో సంబంధం ఉన్న సదరు వ్యక్తిపై కరోనా సమయంలో రాపిడ్ కిట్ల విక్రయానికి సంబంధించి, అలాగే ఓ రాజకీయ నాయకుడి కుటుంబానికి సంబంధించిన ఖాతాల వ్యవహారంలోనూ ఆరోపణలు ఉన్నాయి.