IPL Fansకు బ్యాడ్ న్యూస్

12-11-2026 | 12:51pm

12 జట్ల IPL ప్రచారానికి చెక్.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు కీలక అప్‌డేట్. ప్రస్తుతం 10 జట్లతో కొనసాగుతున్న ఐపీఎల్‌ను 2028 సీజన్ నుంచి 12 జట్లకు విస్తరించనున్నారంటూ గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెరదించింది. కొత్తగా రెండు ఫ్రాంచైజీలను చేర్చే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. పుణె, వడోదర నగరాల్లో కొత్త జట్లు రానున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

ఈ అంశంపై సైకియా మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను 12 జట్లకు పెంచే విషయంపై బోర్డులో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రస్తుతం తమ పూర్తి Focus 2027 IPL Season‌పైనే ఉందని తెలిపారు. వచ్చే ఏడాది జరిగేది ఐపీఎల్ 20వ సీజన్ కావడంతో దాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జట్ల సంఖ్య పెంపుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని స్పష్టం చేశారు.

మరోవైపు ఫ్రాంచైజీల Team Purseను రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచనున్నారన్న ప్రచారంపైనా సైకియా స్పందించారు. ప్రస్తుతానికి పర్స్ మనీ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. డిసెంబర్ 16న జరగనున్న IPL 2027 Mini Auction ప్రస్తుత ఆటగాళ్ల ఒప్పందాల సైకిల్‌లో చివరి వేలం కానుంది. ఆ తర్వాత జరిగే Mega Auctionకు ముందు ఫ్రాంచైజీల పర్స్ విలువ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇక ఐపీఎల్ నిర్వహణ సమయాన్ని ఏప్రిల్-మే నుంచి జనవరికి మార్చాలన్న ప్రతిపాదనపై స్పందించేందుకు సైకియా నిరాకరించారు. ప్రస్తుతం 2027 సీజన్ నిర్వహణపైనే బోర్డు దృష్టి పెట్టిందని తెలిపారు. దీంతో 2028లో రెండు కొత్త జట్లు, రూ.150 కోట్ల పర్స్ అంటూ సాగిన ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

మరిన్ని వార్తలు