పట్టు బిగించిన ఈస్ట్‌జోన్
కష్టాల్లో సౌత్ జోన్
కెప్టెన్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం
పడిక్కల్ హాఫ్ సెంచరీ
సౌత్ జోన్ స్కోరు 242/6
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్‌జోన్ జోరు కొనసాగుతోంది. భారీ స్కోరు చేసిన ఆ జట్టు బౌలింగ్ లోనూ అదరగొట్టింది. ఫలితంగా సౌత్ జోన్ కష్టాల్లో పడింది. పడిక్కల్ హాఫ్ సెంచరీ చేయగా, కెప్టెన్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికే 6 వికెట్లు కోల్పోయిన సౌత్ జోన్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది.
చెన్నై, సెప్టెంబర్ 8: దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో సౌత్ జోన్ ఎదురీదుతోంది. బౌలింగ్‌లో విఫలమైన ఆ జట్టు బ్యాటింగ్‌లోనూ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్, ఈస్ట్ జోన్(East Zone) కొండంత స్కోరుతో ఒత్తిడిలో పడింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మహ్మద్ షమి, ముకేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ సౌత్ జోన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సౌత్ జో న్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు.
ఓపెనర్ రికీ భుయ్(1) ఆరంభంలోనే వెనుదిరగ్గా.. నారాయణ్ జగదీషన్, దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడారు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన నారాయణ్ జగదీషన్(32)ను శిఖర్ మోహన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు షేక్ రషీద్‌తో కలిసి పడిక్కల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసు కున్నాడు.
సెంచరీ దిశగా సాగిన పడిక్కల్‌ను ముఖేష్ కుమార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 3 పరుగుల వ్యవధిలోనే సౌత్ జోన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, రవిచంద్రన్ స్మరణ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని షమీ విడదీసాడు. రవిచంద్రన్(23) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆఖరి సెషన్‌లో శ్రేయస్ గోపాల్, తిలక్ వర్మ
సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో తిలక్ వర్మ 123 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆచితూచి ఆడిన శ్రేయ స్ గోపాల్‌ను ఖురైషి ఔట్ చేసి ఆరో వికెట్‌కు నమోదైన 66 పరుగుల భాగస్వా మ్యానికి తెరదించాడు. చామ మిలింద్‌తో కలిసి తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు.
అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మరో వికెట్ పోకుండా మూడో రోజు ఆటను ముగించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. తిలక్ వర్మ 56 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముఖేష్ కుమార్తో పాటు ఖరైషి, శిఖర్ మోహన్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది.