సిద్దిపేట ఆర్టీసీ డీఎం తీరుపై కార్మిక నాయకుల ఆగ్రహం

09-11-2026 | 08:43pm

తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

సిద్దిపేట క్రైం, నవంబర్ 9 : ఆర్టీసీ కార్మికుల(RTC workers) పట్ల సిద్దిపేట డిపో మేనేజర్ వ్యవహరిస్తున్న తీరుపై సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు(Leaders of the RTC workers' unions in Siddipet and Dubbak) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేటలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎంయూ రీజినల్ అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడారు. దుబ్బాక ఆర్టీసీ కార్మికుల సమస్యలను డీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన తమకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

'కూర్చోవడానికి కుర్చీలు లేవా' అని ప్రశ్నించగా, కార్మికులను కూర్చోబెట్టే ఆర్డర్లు ఇంకా రాలేదంటూ డీఎం వెటకారంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట ఆర్టీసీ డిపోకు వెళ్లిన సమయంలోనూ కార్మిక నాయకులను కింద కూర్చోబెట్టి మాట్లాడారని తెలిపారు. ఈ ఘటనపై సంగారెడ్డి రీజినల్ మేనేజర్ సమగ్ర విచారణ చేపట్టకుండానే డీఎం తప్పు చేయలేదంటూ హెడ్ ఆఫీస్‌కు నివేదిక పంపడం బాధాకరమన్నారు.

ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో ఈయూ డిపో కార్యదర్శి డి.వై.రెడ్డి,  ప్రాంతీయ సహాయ కార్యదర్శి లాల్, టీఎంయూ నాయకుడు బాలు, ఎన్ఎంయూ డిపో కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు రంగయ్య, కంకయ్య, నటరాజ్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు