భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య
ప్లాటు విక్రయించి డబ్బులు ఇవ్వాలని వేధింపులు
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): భర్త వేధింపులు(Harassment by husband) తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె స్రవంతి (35)కి సుమారు 11 ఏళ్ల క్రితం ఇరుకుల్ల గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్(42)తో వివాహమైంది. పెళ్లి సమయంలో సంపత్‌కు రెండు వాహనాలతో పాటు కట్నంగా రూ.8 లక్షల నగదు ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొంతకాలం పాటు గత ఆరు నెలలుగా భర్త సంపత్ తన మామ వద్ద ఉన్న ప్లాటును విక్రయించి డబ్బులు తీసుకురావాలని స్రవంతిపై ఒత్తిడి తెస్తూ వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో తరచూ గొడవపడుతూ శారీరకంగా హింసించేవాడని స్రవంతి తన తండ్రికి చెప్పడంతో ముత్తయ్య ఇరుకుల్లకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో సంపత్‌కు నచ్చజెప్పారు. అయినా వేధింపులు ఆగలేదని అందుకే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.భర్త వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. మృతురాలు తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.