నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత
అర్హులందరికీ న్యాయం చేయడమే లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గంలో(Husnabad Constituency) పూర్తిగా ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల(Indiramma house) కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో నివసిస్తున్న వారికి ముందుగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఇళ్లను కేటాయిస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు(Gauravelli-Gandipalli Projects) నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయి, ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు పొందని నిర్వాసితుల్లో భూమి ఉండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా చిగురుమామిడి, సుందరగిరి తదితర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి జనగామ మార్గంలో అక్కన్నపేట మీదుగా రహదారి విస్తరణ తదితర కారణాలతో ఇళ్లు కోల్పోయిన అర్హులైన వారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చౌటపల్లి వద్ద ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి అర్హత ఉండి ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించేల చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యం అన్నారు.
ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారి విస్తరణ కారణంగా నివాసాలను కోల్పోయిన అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశం మని మంత్రి చెప్పారు.