ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ వాటా
భూపాలపల్లి టౌన్,సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి ): ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(Reservation) కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవికుమార్(Tatikanti Ravikumar) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్నప్పటికి అన్ని చట్టసభలలో వారికి తగిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం విషయంలో బీసీలకు రాజకీయ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీల రాజకీయ సాధికారత కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని రవి కుమార్ పిలుపునిచ్చారు.