వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు – తులసి కల్యాణం
సిద్దిపేట రూరల్, నవంబర్ 24: రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని(Pulluru Village) బండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించిన అనంతరం 50కి పైగా జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, తులసి కల్యాణం జరిపించారు. భక్తుల రాకతో పుల్లూరు బండ ఆధ్యాత్మిక సందడితో కిటకిటలాడింది.
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున స్వయంభూ సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకట నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగాచార్యులు తెలిపారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన నరసింహ హోమం, వైకుంఠ ఏకాదశి, మాఘ అమావాస్య జాతర, నరసింహ జయంతి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేషుకుమార్ వీణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్, మాజీ సర్పంచులు నరేష్, తిరుపతిరెడ్డి, డీలర్ తిరుపతి, రామారావు, దుర్గారెడ్డి, ఉడుత మల్లేశం తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.