గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు

24-09-2026 | 07:21pm

సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : దుబ్బాక పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) తెలిపారు. గురువారం  దుబ్బాకలోని గణేష్ నిమజ్జన మార్గాలను, ప్రతిపాదిత నిమజ్జన స్థలాన్ని  సీపీ సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడూతూ, శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని దుబ్బాక సీఐ రాజేష్‌ ను ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, పోలీస్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో హాబ్సీపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సీపీ సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ తనిఖీ

మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ను గురువారం సీపీ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. స్థానిక సీఐ రాజేష్, ఎస్ఐ సతీష్‌, పోలీస్ సిబ్బందికి సీపీ పలు కీలక సూచనలు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఆదేశించారు.

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన ఒక గణేష్ మండపాన్ని సీపీ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు