బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటన...
బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(State Minister for Child Welfare, Seethakka) మంగళవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండలంలోని కోయగుట్ట గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కర్,మాజీ ఆగ్రో పరిశ్రమల చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, వైస్ చైర్మన్ రేష్మ ఎజాజ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కోయగుట్టలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి బోర్లం గ్రామానికి చేరుకున్న సీతక్క వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు. అదేవిధంగా బాన్సువాడ పట్టణంలోని డ్వాక్రా మహిళా సంఘం భవనం ప్రారంభోత్సవం చేపట్టారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరణ
బోర్లంలో నిర్వహించిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు.
మంత్రి పర్యటన వేళ ముందస్తు అరెస్టులు
మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా , బీఆర్ఎస్ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో మంత్రి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.