టీబీ ముక్త్ అభియాన్‌లో నాగల్‌గిద్దకు అరుదైన గౌరవం
- మూడు గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అవార్డులు
- అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
నాగల్‌గిద్ద, అక్టోబర్ 8 (విజయక్రాంతి): టీబీ ముక్త్ అభియాన్‌లో(TB-Mukt Abhiyan) భాగంగా నాగల్‌గిద్ద మండలంలోని మూడు గ్రామ పంచాయతీలకు(Village Panchayats) జిల్లా స్థాయి అవార్డులు లభించాయి. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో మండలంలోని శేరి దామరగిద్ద, ముక్తాపూర్, కిషన్ నాయక్ తండా గ్రామ పంచాయతీలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి చేతుల మీదుగా శేరి దామరగిద్ద సర్పంచ్ రాజు, ముక్తాపూర్ సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, కిషన్ నాయక్ తండా సర్పంచ్ అనిత సంజీవ్‌కుమార్ అవార్డులను అందుకున్నారు. వీరితో పాటు నాగల్‌గిద్ద ఎంపీడీవో మహేశ్వర్‌రావు కూడా అవార్డును స్వీకరించారు.
క్షయవ్యాధి రహిత గ్రామాల సాధనే లక్ష్యంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాల్లో టీబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, వ్యాధిగ్రస్తులకు సకాలంలో చికిత్స అందించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మూడు గ్రామ పంచాయతీలకు ఒకేసారి జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. అవార్డులు అందుకున్న సర్పంచ్‌లకు ఆయా గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు.