పటిష్టమైన భద్రతే అభివృద్ధికి పునాది

23-10-2026 | 10:54am

ప్రజల్లో భయాన్ని కాదు.. భరోసాను కల్పించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అమీన్‌పూర్‌లో టీజీఎస్‌పీఎఫ్ 36వ రైజింగ్ డే పరేడ్‌.. గౌరవ వందనం స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి

పటాన్ చెరు/అమీన్ పూర్, అక్టోబర్ 23: సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ పటిష్టమైన రక్షణ, భద్రతే అభివృద్ధికి పునాది అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 67 సంస్థలకు 2 వేల మందికి పైగా టీజీఎస్‌పీఎఫ్ సిబ్బంది భద్రతా సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ భద్రతా రంగంలో విశేష సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్‌లో ఉన్న టీజీఎస్‌పీఎఫ్ సెక్యూరిటీ అకాడమీలో(TGSPF Security Academy) నిర్వహించిన 36వ రైజింగ్ డే పరేడ్‌కు ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 36వ బ్యాచ్ టీజీఎస్‌పీఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీసు కవాతును తిలకించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత 35 ఏళ్లలో భద్రతా రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రజల ఆస్తులు, కీలక వ్యవస్థలకు రక్షణ కల్పించడంలో టీజీఎస్‌పీఎఫ్ సిబ్బంది పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు