ఆసుపత్రి ముందే మురికి కాలువలు.. చెత్తాచెదారం!
మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా?
రోగులకు అపరిశుభ్రతతో అవస్థలు.. దుర్వాసనతో వ్యాధుల భయం
హుజురాబాద్,(విజయక్రాంతి): రోగులకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రి పరిసరాలే అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. హుజురాబాద్ ఏరియా సివిల్ ఆసుపత్రి(Huzurabad Area Civil Hospital) ప్రధాన ద్వారం ముందే మురికి కాలువలు, పేరుకుపోయిన చెత్తాచెదారం దర్శనమిస్తున్నా మున్సిపల్ అధికారులకు పట్టింపు లేకుండా పోయిందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రికి నిత్యం చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తాచెదారం తొలగించకపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
దీనికి తోడు దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, కనీసం ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న పరిసరాలనైనా పట్టించుకోరా? అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.