కాలువను కబళించి రియల్ దందా!
రాందాస్‌పల్లిలో ‘వైబీఆర్ గ్రాండ్యూర్ స్పేస్’ వెంచర్ నిర్వాకం
ప్లాట్లుగా మారిన నీటిపారుదల కాలువ
నిద్రమత్తులో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండలం(Ibrahimpatnam Mandal) రాందా స్పల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ ఆక్రమణలు మరోసారి బట్టబయలయ్యాయి. సర్వే నంబ ర్లు 41/15, 41/16లలో వెలుస్తున్న ’వైబీఆర్ ఇన్ఫ్రా గ్రాండ్యూర్ స్పేస్’ వెంచర్లో ప్రధాన కాలువను మట్టితో పూడ్చివేసి చదును చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలను గాలికొదిలేసి, అధికారుల కళ్లెదుటే నీటి వనరు ఆనవాళ్లు లేకుండా పోతుండటంపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. అభివృద్ధి ముసుగులో రియ ల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులు, వర్షపు నీటి కాలువలను సైతం కబళిస్తూ యథే చ్ఛగా వెంచర్లు వెలుస్తున్నాయి. కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో, పంట పొలాలకు నీరందించే, వర్షపు నీటిని తీసుకెళ్లే కాలువను పూడ్చివేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు.
కాలువ ఆనవాళ్లు తొలగింపు..
రాందాస్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 41/15, 41/16లలో ‘వైబీఆర్ ఇన్ఫ్రా గ్రాండ్యూర్ స్పేస్’ (వై బీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాండెర్ స్పేస్ ) పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణం జరుగుతోంది. ఈ సర్వే నంబర్ల గుండా ప్రవహించే ప్రధాన కాలువను వెంచర్ నిర్వాహకులు పూర్తిగా ఆక్రమించి మట్టితో పూడ్చివేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు వర్షపు నీటి ప్రవాహానికి ప్రధాన మార్గంగా ఉన్న కాలువ, నేడు జేసీబీల ధాటికి ఆనవాళ్లు కోల్పోయి చదునైన నేలగా మారిపోయింది.
నిబంధనలు బేఖాతరు.. అధికారుల మౌనం వెనుక మతలబేంటి?..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వెంచర్ ఏర్పాటు చేసేటప్పుడు అందులో నుంచి వెళ్లే నాలాలు, కాలువలు, చెరువుల బఫర్ జోన్లను తప్పనిసరిగా వదిలివేయాలి. వాల్టా చట్టం ప్రకారం నీటి వనరుల స్వరూపాన్ని మార్చడం తీవ్రమైన నేరం. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలించి, రోజుల తరబడి భారీ యంత్రాలతో కాలువను పూడ్చివేస్తుంటే స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
‘ఇంత పెద్ద ఎత్తున మట్టి పోసి కాలువను చదును చేస్తుంటే అధికారులకు తెలియకుండా ఉంటుందా? లేక తెలిసీ మామూళ్ల మత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా?‘ అని గ్రామస్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వెంచర్ లేఅవుట్ అనుమతుల సమయంలో ఈ కాలువను మ్యాప్‌లో చూపించారా లేక అధికారులే దాచిపెట్టారా అన్న దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.