వ్యాపారం విస్తరించండి

19-11-2026 | 05:05am
  1. ప్రధాన కార్యాలయం ముంబైలోనే కొనసాగించండి
  2. ఉత్పత్తి, విస్తరణకు తెలంగాణలో అనుకూలత
  3. ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని నియమిస్తాం 
  4. పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా
  5. ముంబైలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-’ రోడ్‌షో

హైదరాబాద్, నవంబరు 18 (విజయక్రాంతి): ‘మీ ప్రధాన కార్యాలయాన్ని ముంబైలోనే కొనసాగిస్తూ.. తయారీ, వ్యాపార విస్తరణ కార్యకలాపాలను మాత్రం తెలంగాణలో చేపట్టండి’ అని పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Telangana IT Minister Sridhar Babu) కోరారు. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని సూచించారు. ముంబైలోని వర్లీలో ఫోర్ సీజన్స్ హోట ల్లో బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

తెలంగాణకు చెంది న వేలాది మంది కార్మికులు, చేతివృత్తిదారులు, వ్యాపారవేత్తలు ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని.. తెలంగాణ ప్రగతిలో మీరు కలిసిరావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాంకేతికత, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), డేటా సెంటర్లు, ఔషధాలు, వస్త్రాలు, మీడియా, వినోదం వంటి రంగాల్లో రాష్ర్టంలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల పారిశ్రామిక విధానాలు సంస్థల విస్తరణకు దోహదపడతాయని స్పష్టం చేశారు.

పెట్టుబడిదారులకు అండగా..

సంస్థల ఏర్పాటుకు పెట్టుబడుల నుంచి ఉత్పత్తి వరకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చారు. ముంబైలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఆర్థిక, కార్పొరేట్ సంస్థలను తెలంగాణలోని తయారీ సామర్థ్యాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అవకాశాలతో అనుసంధానించడం ద్వారా పరస్పర ప్రయోజనాలు సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి ముంబైకి చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

పెట్టుబడి ప్రతిపాదనలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, పరస్పర భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు.పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్ గురించి వివరించారు.  డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-’కు రావాలని వారిని ఆహ్వానించారు. సీఐఐ మహారాష్ట్ర రాష్ట్ర మండలి ఉపాధ్యక్షురాలు ఆర్తి కూచిభట్ల ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. బృందంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ   వైస్ చైర్మన్, ఎండీ శశాంక్, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి ఉన్నారు.

మరిన్ని వార్తలు