సీఐ అడ్డంగా బుక్! స్టేషన్లో మరో ట్విస్ట్
హైదరాబాద్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారి.. లంచం ఆరోపణలతో ACB వలకు చిక్కారు. హైదరాబాద్‌లోని టోలీచౌకి పోలీస్ స్టేషన్లో(Tolichowki Police Station) అవినీతి నిరోధక శాఖ అధికారులు(Anti-Corruption Bureau) ఆకస్మికంగా దాడులు నిర్వహించడం కలకలం రేపింది. రూ.20 వేల లంచం తీసుకుంటున్న సమయంలో సీఐ రమేశ్ నాయక్‌ను(Toli Chowki CI Ramesh Naik) అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు హోటల్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే డబ్బులు చెల్లించాలంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఆయన డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో నెలనెలా రూ.50 వేలు ఇవ్వాలని సీఐ కోరినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటుండగా ACB అధికారులు ఆకస్మికంగా రంగంలోకి దిగి పట్టుకున్నారు. అయితే అసలు కథ ఇక్కడితో ముగియలేదు. పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టిన అధికారులకు నాలుగు వేర్వేరు కవర్లలో ఉంచిన రూ.1.85 లక్షల అదనపు నగదు లభించింది. దీంతో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వసూలు చేశారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఒకవైపు లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారం.. మరోవైపు స్టేషన్లో బయటపడిన అదనపు నగదు.. ఈ రెండు అంశాలు హైదరాబాద్ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలు, ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో ACB Investigation కొనసాగుతోంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.