క్రీడాకారుల సమస్యలు కనిపించడం లేదా?

19-11-2026 | 05:10am

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ ఆగ్రహం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): ‘హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే రేవంత్ రెడ్డి.. క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ప్రశ్నించారు. అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, క్రీడాకారులను కూడా దగా చేస్తున్నదని మండిపడ్డారు.

‘క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే.. చేతలు గల్లీ స్థాయిని దాటకపోవడం సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బృందం బుధవారం హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను వివరించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సీఎం ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది’ అని తెలిపారు. ‘ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా? విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా?’ అని హరీశ్ ప్రశ్నించారు. కోచ్‌లను నియమించాలని,  పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు