ముదిరాజ్ కాలనీలో హైడ్రామా.. ప్రభుత్వ భూమి స్వాధీనం
ఎల్బీనగర్, అక్టోబర్ 24 : హయత్ నగర్ డివిజన్ లోని ముదిరాజ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున పోలీస్ బందోబస్తు సాయంతో అధీనంలోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ముదిరాజ్ కాలనీలో సర్వే నెంబర్ 255లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ హయాంలో పేద దళిత, ఇతర వర్గాల రైతులకు ఏక్ సాల్ పట్టా పేరుతో వ్యవసాయం చేసుకోవడానికి ఎకరం భూమి చొప్పున కేటాయించారు. కొందరు రైతులు తమ అవసరాల కోసం భూమిని విక్రయించారు. కొందరు కొన్నేళ్లుగా వ్యవసాయం చేసి, తర్వాత పడావు పెట్టారు. ఇటీవల 18 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. స్థానికులు, రాజకీయ నాయకులు అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీస్ (Revenue officers Police)బందోబస్తుతో వచ్చి, స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ టవర్స్
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి, పేదలకు డబుల్ బెడ్ రూమ్(Double bedroom) ఇండ్లు ఇస్తున్నట్లు ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జానకి తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని, భూమి స్వాధీనానికి సహకరించాలని కోరారు.
భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు
ముదిరాజ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 150 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భూమి స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆందోళన చేపట్టారు