మున్సిపల్ బరిలోకి అసదుద్దీన్ ఓవైసీ పార్టీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీ.. 21 మంది అభ్యర్థులు బరిలోకి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేళ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులను బరిలోకి దింపినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో పార్టీ ఉనికిని విస్తరించుకోవడమే లక్ష్యంగా ఎంఐఎం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు విజయవాడ కార్పొరేషన్‌లో మూడు డివిజన్లు, హిందూపురంలో ఐదు వార్డులు, ఆదోనిలో ఏడు వార్డులు, రాయదుర్గంలో మూడు వార్డుల్లో పోటీకి సిద్ధమైంది. నంద్యాల, పెనుగొండ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో అభ్యర్థులను నిలిపింది. కీలక స్థానాలపై దృష్టి సారిస్తూ ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
గెలుపు అవకాశాలున్న చోట్లే ఫోకస్.. ఓవైసీ వ్యూహం!
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్‌లో పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విస్తృతంగా పోటీ చేయడం కంటే, పార్టీకి గెలుపు అవకాశాలు (Winning Chances) ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ Strategyలో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్, మహమ్మద్ ముబీన్, మాజిద్ హుస్సేన్‌తో పాటు ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీకి మద్దతు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంఐఎంకు రాష్ట్రంలో రాజకీయంగా ఎంతవరకు కలిసివస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. పోటీ చేస్తున్న వార్డులు, డివిజన్లలో ఎంతమంది అభ్యర్థులు విజయం సాధిస్తారు? స్థానిక సంస్థల్లో పార్టీ తన ప్రభావాన్ని పెంచుకోగలుగుతుందా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.