టీపీఓతో పంచాయితీ.. నల్ల బ్యాడ్జీలతో సిబ్బంది

24-10-2026 | 01:51pm

బెల్లంపల్లి, అక్టోబర్, (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి (TPO)పై మాజీ కౌన్సిలర్ తాండ్ర రామకృష్ణ అనుచితంగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. ఈ నెల 23న మాజీ కౌన్సిలర్ తాండ్ర రామకృష్ణ బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చి, రోడ్డు వెడల్పునకు సంబంధించిన ఆర్టీపీ (RTP) సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారిని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన టీపీఓ, కోరిన సమాచారాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాల్సి ఉంటుందని, సంబంధిత సమాచారం కోసం సమాచార హక్కు చట్టం (RTI) కింద అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందిస్తామని అధికారి తెలిపినట్లు వివరించారు.

ఈ విషయంపై రామకృష్ణ అసహనం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారితో అనుచితంగా మాట్లాడినట్లు సిబ్బంది ఆరోపించారు. నిబంధనల ప్రకారం సమాచారాన్ని అందించేందుకు అధికారి వివరణ ఇచ్చినప్పుడు దానిని తప్పుగా అర్థం చేసుకుని అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు సైతం ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణను గౌరవించాలని, సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.

విధి నిర్వహణలో ఉన్న అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు