వరంగల్ నగర భవిష్యత్తు అభివృద్ధి కోసమే రోడ్ల విస్తరణ
రూ.2 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ నగర భవిష్యత్తు అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు. హనుమకొండ బస్టాండ్ నుంచి జేఎన్ఎస్ స్టేడియం మీదుగా అశోక జంక్షన్ వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ(Road Expansion) పనులకు శంకుస్థాపన(Foundation ) చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతోందని, అనేక ప్రాంతాల్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాతకాలం నాటి రహదారులు ప్రస్తుత జనాభా, వాహనాల అవసరాలకు సరిపోవడం లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నగర అభివృద్ధిని పక్కన పెట్టడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. నేటి నిర్ణయాలు రేపటి తరాలకు ఉపయోగపడేలా ఉండాలని, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడకుండా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాలని సూచించారు.
హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రహదారులను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే బస్టాండ్ నుంచి రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గతంలో రోడ్లపైకి భవనాలు, దుకాణాలు విస్తరించేలా అనుమతులు ఎలా ఇచ్చారో ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రహదారుల విస్తరణకు ఆటంకాలు కలిగించే నిర్మాణాల వల్ల నగర అభివృద్ధికి నష్టం జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. నగర అభివృద్ధిని అడ్డుకునే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, విమర్శలు చేయడం కంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. నగర ప్రయోజనాల కోసం ఎవరైనా మంచి సలహాలు ఇస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జేఎన్ఎస్ స్టేడియం పరిసర ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్టేడియం పరిసరాల్లో రహదారి విస్తరణతో పాటు వాణిజ్యపరమైన అవకాశాలను మెరుగుపరిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ఆ ఆదాయాన్ని నగర అభివృద్ధికి, స్టేడియం వంటి ప్రజా అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ తోట వెంకన్న,వేముల శ్రీనివాస్,నాయకులు తోట పవన్,నలుబోలు సతీష్, తదితరులు పాల్గొన్నారు.