ఏసీబీ వలలో పీపీ!
- ముద్దాయిల నుంచి రూ.1.50 లక్షల లంచం డిమాండ్
- మధ్యవర్తి ద్వారా తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్
- మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ మహా ఘనుడు!
- గ్రానైట్ క్వారీ నుంచి ఏకంగా ౧౩లక్షలు డిమాండ్
- పట్టుకున్న అధికారులు
పెద్దపల్లి/మహబూబాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): అవినీతికి అంతులేకుండా పోతున్నది. ఒకపక్క ఏసీబీ దాడులు చేస్తున్నా.. మరోపక్క అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. బుధవారం పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఓ గవర్నమెంట్ ప్లీడర్, మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో ఓ సర్పంచ్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.
నిందితుల పక్షాన నిలబడతానని..
ఓ కేసులో నిందితులకు అనుకూలంగా ఉంటాననే హామీతో లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ ఏసీబీకి చిక్కాడు. అతనితోపాటు మధ్యవర్తిని సైతం పట్టుకున్నారు. ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో 2023లో నమోదైన క్రైం నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణకు సహకరించి, కేసులో వారు నిర్దోషులుగా బయటపడేలా చేస్తానని రవీందర్ మొదట రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బును మధ్యవర్తి రాజయ్య ధరించిన ప్యాంటు ఎడమ జేబు నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాజయ్య రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమంగా లబ్ధి పొందేందుకు పీపీ ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, మధ్యవర్తి రాజయ్యలను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
గుట్టలకే గురి పెట్టిన సర్పంచ్ ‘వీరు’డు
మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం, మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరు బుధవారం వరంగల్ ఏసీబీ బృందానికి పట్టుబడ్డాడు. తగ్గించాడు. గ్రానైట్స్ క్వారీలకు సహకరించడానికి సర్పంచ్ లంచంగా రూ.30లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.౧౩లక్షలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు బుధవారం గ్రానైట్ క్వారీల ఆఫీసులో రూ.2లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.