మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం
భూపతిపూర్ వద్ద పెట్రోల్ పంప్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijayaramana Rao ) అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో సుమారు రూ.1.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చైతన్య జ్యోతి పెట్రోల్ పంపు ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha)తో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపులు(Petrol Pump) ఏర్పాటు చేయడంతో పాటు చిన్న దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్కూల్ యూనిఫామ్ల కుట్టు కేంద్రాలు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 15,715 స్వశక్తి సంఘాలకు రూ.33.42 కోట్ల మేర రుణాలు అందించామని వివరించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్వశక్తి సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురు సభ్యులు ప్రమాదాల్లో మరణించగా వారి కుటుంబాలకు రూ.60 లక్షల బీమా అందించామని తెలిపారు. సహజ మరణం సంభవించిన మహిళలకు రూ.2 లక్షల రుణ బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు.
మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు టి ఏ ఎస్ కే ద్వారా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని కొత్త మార్గాలను సూచిస్తే వాటిని కూడా ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డీఆర్డీఓ కలిందిని, అడిషనల్ డిఆర్డిఓ రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వశక్తి సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.