గంజాయి సాగు.. గుట్టురట్టు
- వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ
- పత్తి పంటలో అంతర పంటగా గంజాయి
- రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం, గిరిజన రైతు అరెస్టు.
- వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల.
నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): జిల్లాలో గంజాయి సాగుపై(Cannabis cultivation) పోలీసులు ఉక్కు పాదం విధిస్తున్న మారుమూల గిరిజన తాండలో మాత్రం ఇంకా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో కొందరు గిరిజన రైతులు పంటచెర్లలో పత్తి ఇతర పంటల మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేసి గంజాయిని విక్రయిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పత్తి చేలో గిరిజన రైతు గంజాయి సాగు చేస్తూ ఉండగా పోలీసుల పట్టుకున్నారు.
పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యవహారాన్ని నిర్మల్ జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. మామడ మండలం దంజీనాయక్ తండా పరిధిలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, సాగుదారుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
మామడ మండలం తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలోని దంజీనాయక్ తండాకు చెందిన కున్సోత్ రవి తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు వ్యవసాయ క్షేత్రంపై దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన గంజాయి మొక్కలతో పాటు ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉంచిన 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు.
వీటి మొత్తం విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. గంజాయి సాగుకు పాల్పడుతున్న కున్సోత్ రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా గంజాయి గస్తీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, విక్రయిస్తున్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, శిక్షణ డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.