సైబర్ భద్రతపై అవగాహన సదస్సు
నిర్మల్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వృద్ధుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ(District Welfare Department) ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో “సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత, వృద్ధులపై దుర్వినియోగం నివారణ” అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల వయోవృద్ధులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రకటనలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. డిజిటల్ సేవలను సురక్షితమైన పద్ధతిలో ఎలా వినియోగించుకోవాలో వివరంగా వివరించారు. వృద్ధులపై జరిగే శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులను త్వరితగతిన గుర్తించి నివారించేందుకు తగిన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సైబర్ వింగ్ ఎస్ఐ శ్రావణి, రిటైర్డ్ పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే పోతా రెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షులు కే రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.