అటవీ భూమిలో అక్రమంగా చెట్ల నరికివేత

29-09-2026 | 08:25pm

దున్నుకునేందుకు ప్రయత్నం.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు

జుక్కల్, సెప్టెంబర్ 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి ఫారెస్ట్ పరిధిలోని(Bandapalli Forest Range) 325 కంపార్ట్మెంట్‌లో అటవీ భూమిలో అక్రమంగా ప్రవేశించి చెట్లు, మొదలు నరికివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గౌరారం తండాకు చెందిన నునావత్ రూప్ సింగ్ అటవీ భూమిని దున్నుకునే ఉద్దేశంతో అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి చెట్లు, మొదలను నరికివేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం నునావత్ రూప్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటవీ భూముల్లో అక్రమంగా ప్రవేశించి చెట్లను నరికివేయడం, భూమిని సాగు చేసేందుకు ప్రయత్నించడం చట్టవిరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రేంజ్ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అటవీ అధికారులు శ్రీనివాస్, హనుమాన్లు, సంతోష్ రెడ్డి తదితరులు చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

నిందితుడిని తదుపరి న్యాయపరమైన చర్యల నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీ కోసం బిచ్కుంద కోర్టులో హాజరుపరిచినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ భూములను ఆక్రమించేందుకు లేదా చెట్లను నరికివేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్ల నరికివేత, భూముల ఆక్రమణకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు