‘తూనికల’ అధికారులు ఎక్కడ?
- కానరాని తూనికల శాఖ తనిఖీలు
- వినియోగదారుల జేబులకు చిలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో(Jukkal Constituency )తూనికల కొలతల శాఖ (Department Legal Metrology)(లీగల్ మెట్రాలజీ) అధికారుల తనిఖీలు పూర్తిగా కరువయ్యాయని స్థానిక ప్రజలు,వినియోగ దారులు,రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు తక్కువ తూకాలతో వినియోగదారులను, రైతులను మోసం చేస్తున్నారు.
కిరాణా, మాంసం దుకాణాలలో మోసం
పట్టణాలు, గ్రామాల్లోని కిరాణా షాపులు, చికెన్, మటన్ సెంటర్లలో ముద్రణ (స్టాంపింగ్) లేని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, పాత బాట్లను ఉపయోగిస్తున్నారు.పెట్రోల్ బంకుల్లోసైతం కొలతల్లో విపరీత తేడాలు ఉంటున్నాయని, కొన్ని బంకుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం తో వాహనదారులకు సరియైన మైలేజీ రాక తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతినిత్యం జరిగే లాభాలేవిల్లో ఎక్కడ చూసినా తూకంలో మోసాలతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుందనీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
నిత్యం కూరగాయల మార్కెట్లో విక్రయించే కూరగాయల్లో సైతం తూకంలో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మద్నూర్, జుక్కల్, బిచుకుందా, పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడపగల్ మందలాలు, సంతలు, నిత్యం జరిగే మార్కేట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.స్టాంపింగ్ లేని, మోసం చేసే వేయింగ్ మిషన్లను సీజ్ చేసి ప్రతి ఏటా బాట్ల నవీకరణ (రినివల్) ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడడంలో అధికారులు విఫలమవుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి, వినియోగదారులు,రైతుల ప్రయోజనాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. తూనికల కొలతల అధికారులు ఇప్పటికైనా స్పందించి తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.