మహనీయుడు పటేల్

18-09-2026 | 05:35am
  1. భారత్‌ను ఏకంచేయడంలో కీలకపాత్ర.. మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తి
  2. భూభాగాలు కలుపుకుంటే సమైక్యత నిలవదు.. సమాన అవకాశాలు కల్పించాలి
  3. తెలంగాణ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
  4. పాల్గొన్న గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారత్‌కు స్వాతంత్య్రం రావడం లో మహాత్మాగాంధీ(Mahatma Gandhi), నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose)ఎంత కీలక పాత్ర పోషిం చారో.. దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడటంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతే కీలకపాత్ర పోషించారని ఉపరాష్ట్ర పతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తి గా నిలుస్తాయని తెలిపారు. భూభాగాన్ని కలుపుకొన్నంత మాత్రాన దేశ సమైక్యత నిలవదని, దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు,  సమాన గౌర వం కల్పిస్తేనే సమైక్యత బలపడుతుందన్నారు.

‘వేర్వేరు భాషలు, వేర్వేరు దేవుళ్లను పూజించినా.. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నా.. కూడా అందరినీ మన రాజ్యాంగం ఒక్కటిగా చూస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రస్తుతం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు’ అని తెలి పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

తొలుత బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఉపరాష్ట్రపతిని రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి బండి సంజయ్, హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావు, డా. కే లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, పోలీసు, ఇతర ఉన్నతాధికారులతోపాటు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ చేరుకుని అమర వీరులకు ఉపరాష్ట్ర పతి రాధా కృష్ణన్ నివాళులర్పించారు.

అనంతరం మా ట్లాడుతూ.. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, సరిగ్గా 78 సంవత్సరాల కింద 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో చారిత్రాత్మకమైన ఘట్టం జరిగిందన్నారు. హైద రాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందని, ఆపరేషన్ పోలో చర్యతో ఈ అద్భుతం ఆవిష్కృతమైందననారు.

హైదరాబాద్ వి మోచనం కోసం పోరాడిన ఎంతో మంది వీరులను స్మరించుకునేందుకు, వారి వీరగాథలు భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు 2022 నుంచి కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకొంటున్నా మన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చిం ది కానీ.. అనేక సంస్థానాల విషయంలో సందిగ్ధత కొనసాగిందని పేర్కొన్నారు. 

ముందు చూపుతో..

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవతో ఆ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి. అందులో హైదరాబాద్ సంస్థా నం కూడా ఒకటన్నారు. సర్దార్ వల్లభ్ భా య్ పటేల్ ఎంతో ముందుచూపుతో ఈ బాధ్యతను భుజాన వేసుకుని, సమర్థవంతంగా నిర్వర్తించి.. వేలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారన్నారు.

హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చే సేందుకు నిజాం రాజు నిరాకరించడంతో‘ఆపరేషన్ పోలో’ చర్య జరిపారని గుర్తు చేశా రు. అనంతరం  నిజాం సైన్యం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశారన్నారు. ఈ వి షయంలో సర్దార్ వల్లభ్ భాయి పాత్ర మరువలేనిదన్నారు. హైదరాబాద్ లాంటి సంస్థా నాలను  విలీనం చేసి.. సర్దార్ పటేల్ దేశాన్ని ఉక్కు మాదిరిగా దృఢంగా నిర్మించారు. 

నక్సలిజం నిర్మూలనలో..

1947 మధ్యకాలంలో భారతదేశ నిర్మాణంలో కేంద్ర బలగాలు ఎంతో కృషి చేశాయని, నక్సల్ రహిత భారత్‌గా, ప్రతి రాష్ట్రం ప్రశాంతంగా శాంతి  భధ్రతల సమస్యలు లేకుండా ఉండాలన్నది ప్రధానమం త్రి నరేంద్రమోదీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నక్సలిజం నిర్మూలనలో కూడా ఈ బలగాలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ఆధ్వర్యం లో, ఆయన పర్యవేక్షణలో వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజం దేశంలో అంతమైంద న్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ నక్సలిజం పూర్తిగా కనుమరుగైన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు.

దీంతో రాష్ట్రంలోని యువ తకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ స్వాతం త్య్రం కోసం ఎంతో మంది విద్యార్థులు, ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని, రాంజీ  గోండు, కుమ్రం భీం, తుర్రేబాజ్ ఖాన్ వంటి ఎందరో గొప్ప వారి త్యాగాల వల్లే తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. హైదరాబాద్ సంస్థానం భా రతదేశంలో విలీనం అయ్యేందుకు నిజాం పాలనలోని రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులందరికీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు.

వేలాది మంది చావులకు కారణం ఎవరు?: కేంద్రమంత్రి బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాంను పొగిడే నాయకులారా.. వీర బైరాన్ పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వెయ్యి ఊడల మర్రిలో వేలాది మంది చావులకు కారణం ఎవరో ఆలోచించాలని ఫైరయ్యారు. నిజాంను పొగిడే నాయకుల డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని, అసలు వాళ్లు ఈ దేశ పౌరులేనా? లేక విదేశీ డీఎన్‌ఏ ఉందా? అన్నారు. తెలంగాణ ప్రజలకు నాలుగు పండుగలు ఒకేసారి వచ్చాయని, గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి, నరేంద్రమోదీ బర్త్ డే, తెలంగాణ విమోచన దినోత్సవమన్నారు.

దేశమంతా 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు ఏడాది ఆలస్యంగా వచ్చిందన్నారు. సర్దార్ పటేల్ సంకల్పంతో తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు. తెలంగాణ ప్రజల ధన, మాన ప్రాణాలను దోచుకుని రక్తాన్ని కళ్ల జూసిన నిజాంను గొప్పవాడిగా చిత్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను తెరగమరుగు చేసే కుట్రను బద్దలు కొట్టడానికే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మోదీ ఆధ్వర్యంలో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ ఫలితంగా సొంత రాష్ట్రం సాధించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను ఖర్చుచేసిన చరిత్ర మోదీదే అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్దిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. అవినీతిమయ సర్కార్ కావాలా? అవినీతి రహిత పాలన కావాలా? ఆలోచించాలని, తెలంగాణ చరిత్రను తెరమరుగు చేసే పాలన కావాలా? తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేసే పాలన కావాలా అన్నారు. అవినీతిరహిత పాలన చేస్తున్న మోదీకి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మద్దతివ్వాలని కోరారు. 

హైదరాబాద్ మధ్య విడదీయరాని బంధం: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్

హైదరాబా ద్ మధ్య విడదీయరాని బంధముం దని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తెలంగాణ నేల గొప్ప పోరాట గడ్డని, ఇక్కడ ఎందరో వీరులు త్యాగాలు చేసి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి కల్పించుకున్నారని చెప్పారు. తాను జోధ్‌పుర్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని, ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా అనేకమంధి యోధులు పోరాంటం చేరన్నారు.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసి తెలంగాణను భారత్‌లో కలిపేందుకు కృషి చేశారన్నారు. అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించాలన్నారు

నిజాం అంత మంచోడైతే కుమ్రం భీమ్, చాకలి ఐలమ్మ ఎందుకు తిరగబడ్డారు?:

అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్

నిజాం మంచివాడంటూ, అద్భుతమైన పాలన అందించాడని కొనియాడుతున్న పాలకులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. నిజాం పాలన అంత గొప్పదైతే.. వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, పీవీ నరసింహారావు వంటి ఎంతోమంది మహానుభావులు ని జాం అణచివేతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది?, గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలు రజాకార్ల కిరాతకాల నుండి రక్షణ కోసం తమ గ్రామాల్లో బురుజులు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

స్వతంత్ర భారతంలో భారత సైన్యం నిజాంపై ట్యాం కర్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందు కు వచ్చింది?, ఈ చారిత్రక సత్యాలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ని జాం నిరంకుశ పాలనకు, రజాకార్ల కిరాతక మారణకాండకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు ఈ వేదికగా ఆయన ఘన నివాళులు అర్పించారు.

జర్మనీలో హిట్లర్ నాజీల అరాచకాలను నేటికీ భవిష్యత్ తరాలకు ఒక హెచ్చరికలా ఎలా గుర్తుచేస్తున్నారో, అదే రీతిలో ఇక్కడ నిజాం, రజాకార్లు సా గించిన దౌర్జన్యాలు, మారణహోమం, దేవాలయాలపై దాడు లు, ప్రజల కష్టాలను అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మజ్లిస్ పార్టీకి భయపడి తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. నిజాం పాలనను, రజాకార్ల అరాచకాలను కప్పిపుచ్చి, అసెంబ్లీ సాక్షిగా నిజాంను గొప్పవాడిగా కీర్తించడం బాధాకరమని విమర్శించారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ పాడుతూ ఉద్యమం చేసిన వందేమాతరం రామచంద్రరావుని.. ఆనా డు నిజాం ప్రభుత్వం మతపరమైన గేయమని నిషేధించినట్టే, నేడు అదే రీతిలో మజ్లిస్ పార్టీ వందేమాతరాన్ని వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచ న దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని 1980 నుంచి బీజేపీ లాఠీదెబ్బలు తింటూ, కేసులు, జైళ్లను ఎదుర్కొని పోరాడిందని గుర్తుచేశారు.

రాబోయే 2029 నాటికి తెలంగాణలోని ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి ప్రభుత్వ పాఠశాల, చౌరస్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు నిర్వహించే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఎగరవేయడాన్ని అడ్డుకునే దమ్ము కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు ఉందా అని సవాల్ విసిరిన ఆయన, స్వాతంత్య్ర సమరయోధు లను అవమానిస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తిచేస్తారని హెచ్చరించారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తూ, తెలం గాణ ప్రజల ఆశీస్సులు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు