కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ప్రభుత్వ భూములపై ఆరా

17-09-2026 | 04:35pm

సిద్దిపేట: ఎర్రవల్లి(Erravalli)లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) వ్యవసాయక్షేత్రం పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత సర్వే నంబర్లు, గతంలో ఆ భూముల్లో ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రెవెన్యూ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను సిద్దిపేట ఆర్డీవో చంద్రకళ పరిశీలించారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు సమాచారం.

అధికారులు క్షేత్రస్థాయిలోనూ పర్యటించి ప్రభుత్వ భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. భూముల విస్తీర్ణం, సర్వే వివరాలు, రికార్డుల్లో నమోదైన వివరాలను సరిపోల్చి నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత రెవెన్యూ రికార్డులతో పాటు గతంలో ఉన్న రికార్డులను కూడా పరిశీలిస్తూ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయిన అనంతరం ప్రభుత్వ భూములకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు