ప్రయాణం సాగేదెలా?

18-09-2026 | 05:20am
  1. వారధి కట్టారు.. రోడ్డు మరిచారు

బ్రిడ్జికి ఇరువైపులా పూర్తవ్వని రోడ్డు 

తొందరగా పూర్తి చేయాలని స్థానికుల విజ్ఞప్తి

గణపురం, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం (Transport facility)కల్పించడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెళ్తుర్లపల్లి, కొండాపూర్ గ్రామాల మధ్య వాగుపై 15 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.

గణపురం మండలం నుండి కొండాపూర్ మీదుగా గుర్రంపేట వరకు రాకపోకలు సాగించేందుకు మోరంచ వాగుపై 15 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించినప్పటికీ, వంతెనకు ఇరువైపులా రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు వంతెనకు ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

ముఖ్యంగా వాగవతలి గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రయాణించేందుకు అనేక  అవస్థలు పడుతున్నారు. వంతెన నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగైందని ఆశించిన ప్రజలకు సరైన రహదారి లేకపోవడంతో నిరాశే మిగిలింది. వంతెనకు అనుసంధానంగా ఇరువైపులా వెంటనే  తారు రోడ్డు నిర్మించి, సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

  1. వంతెనకు ఇరువైపులా రోడ్డు నిర్మించాలి
  2. వంతెన నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉంది

ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. కానీ వంతెన నిర్మాణం పూర్తి చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వంతెనకి ఇరు వైపులా మట్టి పోసి వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుమారు 15 గ్రామాల ప్రజలు ఈ రహదారి పైనే ప్రయాణించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వంతెనకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టాలి. 

-పల్లెబోయిన సదయ్య, అప్పయ్యపల్లి

మరిన్ని వార్తలు