విమోచనం పట్టదా?
- విమోచనదినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- పటేల్ చొరవతోనే నిజాం పాలన అంతం: ఎంపీ కే లక్ష్మణ్
- అమరుల త్యాగాల స్మరణకే విమోచన ఉత్సవాలు
- మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17ను తెలంగా ణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వ మే (State Government) అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP State President) డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాబోయే తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర, స్వాతం త్య్ర విలువలు తెలియాలంటే పాఠశా ల పాఠ్యపుస్తకాల్లో తప్పనిసరిగా చేర్చాలని కోరారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రాంచందర్‌రావుతో పాటు ఎంపీ డా.కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నాయకులు చారిత్రక యుద్ధట్యాంక్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఆపరేషన్ పోలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దేశ రక్షణలో, హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించడంలో ఆపరేషన్ పోలో కీలక ఘట్టమన్నారు.
అమరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటల ఫలితంగానే నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి, తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ నిర్ణయం, కే.ఎం. మున్షీ చొరవ, భారత సైనిక చర్య ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని పేర్కొన్నారు.ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధట్యాంక్ తెలంగాణ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే చారిత్రక చిహ్నమని పేర్కొన్నారు.
చరిత్రను విస్మరించారు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ విమోచన చరిత్రను రాష్ట్రంలోని పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు రాజ్యసభ ఎంపీ డా. కె. లక్ష్మణ్ విమర్శించారు. 1948 సెప్టెంబర్ 13 భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని.. అయితే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, రజాకార్ల అండతో నిజాం నవాబు నిరంకుశ పాలన కొనసాగించారని పేర్కొన్నారు.
బైరాన్‌పల్లి, నిర్మల్ తదితర ప్రాంతాల్లో జరిగిన వీరోచిత పోరాటాలను, ప్రజల బలిదానాలను ఆయన గుర్తుచేశారు. జనరల్ జయంత్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ పోలోలో తొలి అమరుడైన నాయక్ బచితర్ సింగ్‌కు భారత ప్రభుత్వం ‘అశోక చక్ర’ పురస్కారం ప్రదానం చేసిందని తెలిపారు.
46 మంది అమర జవాన్ల త్యాగాల పునాదులపైనే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ నిలిచి ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో కేంద్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తర్వాత కూడా భారత సైన్యంపై కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం కొనసాగించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారికంగా నిర్వహించాల్సిందే : బూరనర్సయ్య గౌడ్
మరుగునపడిన తెలంగాణ విమోచన వీరగాథలను, సైనికులు, పోరాట యోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వాటిని భావితరాలకు అందించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్ డా. బూరనర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎలాంటిదో, తెలంగాణ విమోచన స్ఫూర్తి కూడా అంతకంటే గొప్పదన్నారు.
తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను గౌరవించేందుకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ విమోచన ప్రదాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు, సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈనెల 17వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు సంజయ్ ఘనతే, బోనేటి మారుతీ కిరణ్, వీరబెల్లి రవీందర్ రావు, మాజీ మేయర్ బండ కార్తీక, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మోర్చాల నాయకులు, మాజీ సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.