ఓట్ ఫర్ ఓపీఎస్!

14-09-2026 | 05:40am
  1. పాత పెన్షన్ పునరుద్ధరించే పార్టీకే ఉద్యోగుల ఓట్లు
  2. డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌ఎంఓపీఎస్ బహిరంగ సభలో ప్రతిజ్ఞ
  3. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని  ఖర్గేకు సవాల్
  4. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో మద్దతు
  5. ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ 

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించే పార్టీకే ఉద్యోగులు ఓట్లు పడతాయని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) జాతీయ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ(NMOPS National Secretary General Sthitaprajna) పేర్కొన్నారు. ‘జో కోయీ పురాణీ పెన్షన్ బహాల్ కరేగా.. వోహీ దేశ్ పే రాజ్ కరేగా’ (ఎవరైతే పాత పెన్షన్ పునరుద్ధరిస్తారో వారే అధికారాన్ని దక్కించుకుంటారు) అనే నినాదంతో ఉత్తరాఖండ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా పెన్షన్ మార్చ్, ఉద్యోగుల భారీ బహిరంగ సభ హోరు వర్షంలో జరిగింది.

జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ నాయకత్వంలో జరిగిన ఈ మహాసభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారు. ఈ మహాసభకు మన రాష్ట్రం నుంచి తెలంగాణ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్ ప్రవీణ్ హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం సభనుద్దేశించి స్థితప్రజ్ఞ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్ రాజకీయ సమీకరణాలను శాసించే స్థాయికి చేరిందన్నారు.

దక్షిణ భారతదేశంలో ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన పార్టీలకే ఉద్యోగ వర్గాలు పట్టం కట్టాయన్నారు. తమిళనాడు లో టీవీకే, కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్‌కు, కేరళలో యుడిఎఫ్ ప్రభుత్వాలే ఇందుకు నిదర్శనమన్నారు. 2027 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఓపీఎస్ తెచ్చే పార్టీకే ఓటు వేస్తామని సభలోని ఉద్యోగులతో ‘ఓట్ ఫర్ ఓపీఎస్‘ ప్రతిజ్ఞ చేయించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రత్యక్షంగా 1.6 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో ఉన్నారని, వారి కుటుంబ సభ్యులతో కలిపితే దాదాపు 5 నుండి 6 లక్షల ఓటు బ్యా ంకు ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే శక్తిగా మారిందని హెచ్చరించారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అ ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడు తూ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించిన విషయాన్ని స్థితప్రజ్ఞ గుర్తు చేశా రు. కేవలం ఎన్నికల హామీలతో సరిపెట్టకుండా, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళలోనూ తక్షణమే ఓపీఎస్‌ను అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు. మాటల్లో కాకుండా ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఓపీఎస్‌ను అమలు చేసి చూపిస్తేనే ఉత్తరాఖండ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా మద్దతిస్తారని కుండబద్దలు కొట్టారు.

మరిన్ని వార్తలు