బీఆర్ఎస్ భూదోపిడీపై రాస్తే రామాయణం, చెప్తే భారతం
22A అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్
కక్షపూరిత ఆలోచనతోనే 22Aపై కుట్రలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో 22ఏ(22A) నిషేధిత భూములపై చర్చ జరుగుతోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 22 ఏ అంశంపై ప్రసంగిస్తూ గత ప్రభుత్వ భూదోపిడీపై రాస్తే రామాయణం, చెప్తే భారతం అవుతోందని చమత్కరించారు. 22ఏతో ప్రభుత్వం పేదలను వేధిస్తోందని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. మాపై వచ్చిన ఆరోపణల కారణంగా 22ఏ అంశంపై చర్చ చేపట్టామని వివరించారు. మా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ఎల్ నినో(El Niño) కారణంగా పంటలకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ప్రధాన సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకే విపక్షం ప్రయత్నిస్తోందని సీఎం పేర్కొన్నారు. చర్చ ద్వారా తమ లోపాలు బయటపడతాయని విపక్షం భావిస్తోందన్నారు.
అవకతవకలు బయటపడతాయని బీఆర్ఎస్ కు భయం
22ఏలో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయాం నాటి అవకతవకలు బయటపడతాయని భావించారని ఆరోపించారు. క్షుద్ర పూజల అంశం చర్చకు వస్తుందని భావించారని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మనమే ఆదర్శంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదర్శంగా ఉండాల్సిన నేతలు వికృత చేష్టలతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం మేరకు సభ నడుస్తోందన్నారు. స్పీకర్(Speaker)గా ఎన్నుకున్నాక పార్టీలో ఉన్న సంబంధాలు ముగుస్తాయని వివరించారు. సభలో ఉన్న ప్రతి సభ్యుడి హక్కులు కాపాడేందుకు స్పీకర్ కృషి చేస్తారని తెలిపారు. సభ నిర్వహణపై గత ప్రభుత్వం కమిటీ నియమించి నిబంధనలు పెట్టారని గుర్తుచేశారు.
స్పీకర్ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తుండ్రు
సభలో ప్లకార్డులు, నినాదాల ఫ్లెక్సీలు, నినాదాలు దుస్తులతో రావొద్దని నిబంధనలు పెట్టారని చెప్పారు. గత నిబంధనలు అమలు చేయాలని స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ ద్వారా పోలీసులను ఆదేశించారని తెలిపారు. స్పీకర్ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని సూచించారు. పార్లమెంట్ నిబంధనలను(Rules of Parliament) స్పీకర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నినాదాల దుస్తులతో రాకూడదని స్పీకర్ ఆదేశిస్తే ఎవరూ రాకూడదన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ, ఖర్గే ఎవరైనా స్పీకర్ ఆదేశాలు పాటించాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు.