తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మరిన్ని భూపోరాటాలు
పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
భూపాలపల్లి,సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదల కోసం మరిన్ని భూపోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం భూపాలపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ, సభ నిర్వహించారు. కొమరయ్య భవన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామని అన్నారు.
అదే స్ఫూర్తితో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని భూపోరాటాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.నిజాం నిరంకుశ పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన చారిత్రాత్మక పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు.సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోటపలుకుల రమేష్, సుధాకర్‌రెడ్డి, సోతుకు ప్రవీణ్, ఫైండ్ల శాంతి, కొరిమి సుగుణ, 24వ వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి, నేరెళ్ల జోసెఫ్, శ్రీకాంత్, అన్నారపు రాజేందర్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోశం, రవికుమార్, గోలి లావణ్య, గంప శ్రావణి, గడ్డం స్వరూప, మట్టి నాగమణి, పెద్దమామల సంధ్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.