5 September, 2026 | 12:50 AM

కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు

04-09-2026 | 09:57pm

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ఇచ్చిన హామీలు అమలు కాక,ఫీజుల బకాయిలు అందక, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు(BRS Parliamentary Party Leader Vaddiraju) రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాగైనా ఓట్లు దండుకోవాలనే కుయుక్తులతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టుగా హామీలిచ్చారన్నారు.

అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన 420 హామీలు,6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు పర్చకుండా మహిళల సంక్షేమాన్ని విస్మరించారని ఎంపీ రవిచంద్ర(MP Ravichandra) మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పిలుపు మేరకు కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వంటావార్పు కార్యక్రమానికి సుమారు 4వేల మంది తరలివచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు(Former Minister Vanama Venkateswara Rao) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏకరువు పెట్టారు.

కాంగ్రెస్ నాయకులు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామని,వృద్ధాప్య, వితంతు,ఒంటరి మహిళల పింఛన్లను 2వేల నుంచి 4వేల రూపాయలకు పెంచుతామని,కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు బహూకరిస్తామని హామీలిచ్చి అమలు చేయడం లేదన్నారు.పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రూ.1,00,116 చొప్పున ఉచితంగా అందజేసిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం అందజేస్తామన్న కాంగ్రెస్ నాయకుల వాగ్ధానం నీటి మూటగానే మారిందని ఎంపీ  మండిపడ్డారు.

కేబినెట్ లో ఉన్న బీసీ మంత్రిని రేవంత్ రెడ్డి(Revanth Reddy) తొలగించారని, బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచి, సంక్షేమానికి ఏటా 20వేల కోట్లు ఖర్చు చేస్తామన్న హామీ ఒట్టిదేనని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు పాలించడం చేతకావడం లేదని,ప్రభుత్వ భూములను అమ్ముకోవడం, దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారే తప్ప మహిళల సంక్షేమానికి, అభ్యున్నతికి అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు తేలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు నిశితంగా దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పాల్వంచలోని నిషేధిత జాబితాలో పెట్టిన 444,,817,999,727 సర్వే నంబర్లలోని భూములకు అందులో నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు..ఈ వంటావార్పు కార్యక్రమంలో తరలివచ్చిన మహిళలు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలెక్టరేట్ పరిసరాలు గులాబీమయంగా మారాయని,ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది.అంతా కలిసి నేలపై కూర్చొని భోజనాలు చేశారు.