ర్యాలీ ఎఫెక్ట్.. ఢిల్లీలో మెట్రోకు బ్రేకులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైళ్లపై మరోసారి ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను నేడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయనున్నారు. భద్రతా కారణాలతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అయితే, ఈ ఆరు స్టేషన్లలో మెట్రో లైన్ల మధ్య మారే ఇంటర్‌చేంజ్ (Interchange) సదుపాయం అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రతిపక్ష కూటమి సుప్రీంకోర్టు వైపు చేపట్టనున్న నిరసన ర్యాలీ (Protest Rally) నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలు విధించారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు DMRC తెలిపింది.